గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మికలోకం కన్నెర్ర....

30 జులై, 2026

ప్రకాశం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 12:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కలెక్టరేట్‌ను ముట్టడించిన శ్రామిక లోకం

- జిల్లా నలుమూలల నుంచి పోటెత్తిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు

- కనీస వేతనాలు పెంచకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

ప్రజాశక్తి –ఒంగోలు సిటీ : రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జిల్లా నలుమూలల నుంచి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ రంగాల కార్మికులు గురువారం ఒంగోలు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాతో కలెక్టరేట్ పరిసరాలు కార్మికుల నినాదాలతో మార్మోగాయి. చేతుల్లో ఎర్రజెండాలు, ప్లే కార్డులు,నినాదాలతో కదం తొక్కిన కార్మికులు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 71 షెడ్యూల్డ్ వృత్తుల్లో పనిచేస్తున్న 55 లక్షల మంది కార్మికులకు 2009 తర్వాత కనీస వేతనాల సవరణ జరగకపోవడం దారుణమన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను సవరించాల్సిన చట్టాన్ని ప్రభుత్వమే తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కార్పొరేట్లకు వేల కోట్ల రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలకు కార్మికులకు జీవనోపాధి కల్పించే కనీస వేతనాలు పెంచే మనసు లేకపోవడం సిగ్గుచేటన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నెలకు రూ.26 వేల కంటే తక్కువ కాకుండా కనీస వేతనం ప్రకటించి, యాజమాన్యాలతో ఖచ్చితంగా అమలు చేయించాలని డిమాండ్ చేశారు.

పలువురు నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ వేతనాలతో, ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతన సమస్యలు పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి మాట్లాడుతూ 8 గంటల పనివిధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, అదనంగా పనిచేస్తే డబుల్ ఓవర్‌టైం వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, బోనస్, సెలవులు వంటి కార్మిక హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జివి కొండారెడ్డి సి.హెచ్. మంజుందార్, తాండవ రంగారావు, జి.రమేష్, కె.శ్రీనివాసరావు, తాంగిరాల వెంకటేశ్వర్లు, బంకా సుబ్బారావు, పి. ఆంజనేయులుతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్రసంగించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేస్తూ, కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్