ప్రజాశక్తి- ఇచ్ఛాపురం : రాష్ట్రంలో ఈవెనింగ్, నైట్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేసి, అవసరమైన మేరకు న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాలని ఇచ్ఛాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు నందికి రమణయ్యరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కోర్టు ఆవరణలో శుక్రవారం నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ సమావేశంలో న్యాయవాదులు ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని సమగ్రంగా చర్చించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రతిపాదించిన రాత్రి కోర్టుకు నిర్వహించాల్సిన నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ రాష్ట్రాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు ఎదురయ్యే ఆచరణత్మక సమస్యలను సభ్యులు విశ్లేషించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కోర్టులో నిర్వహించాలని ప్రతిపాదనపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధరణ కోర్టు కేసుల్లో విధులు నిర్వహించే న్యాయవాదులు తిరిగి సాయంత్రం కోర్టులకు సమర్థవంతంగా హాజరు కావడం కష్టమని పేర్కొన్నారు ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు సాయంత్రం వేళల్లో విధులు నిర్వహించడం ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కోర్టుల పని పనుల నిమిత్తం వచ్చే కక్షిదారులకు రాత్రి వరకు కోర్టులో వేచి ఉండడం అనంతరం స్వగ్రామాలకు తిరిగి వెళ్లేందుకు తగిన రవాణా సౌకర్యం లేకపోవడం తీవ్ర అసౌకర్యానికి దారితీస్తుందని తెలిపారు. మహిళ కక్షిదారులు రాత్రి వేళలో ప్రయాణించడం మరింత ఇబ్బందికరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సెక్రటరీ ఎం.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ప్రేమలత పట్నాయక్, సంయుక్త కార్యదర్శి, మీడియషన్ ట్రైనింగ్ న్యాయవాది డి.కృష్ణమూర్తి రెడ్డి, ట్రెజరర్ ఆర్.దేవరాజు రెడ్డి, న్యాయవాదులు గిన్ని సీతయ్యరెడ్ది, ఎ.సత్య నారాయణ, లక్ష్మీనారాయణ, జె.కామేష్, భగవాన్ దాస్, భీమారావు రెడ్డి, రంగారావు, ఎ.భైరి, అర్జున్ పాల్గొన్నారు.







కామెంట్లు (0)