శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రణస్థలం ‘కూటమి’లో టికెట్ల కుమ్ములాట!

24 అక్టోబర్, 2026

రణస్థలం ‘కూటమి’లో టికెట్ల కుమ్ములాట! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 04:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​25 ఎంపిటిసి స్థానాలకు కూటమి నుంచే 71 నామినేషన్లు

​టిడిపి నుంచి 42, జనసేన 17, బిజెపి నుంచి 12 మంది దాఖలు

​సయోధ్య కుదరక పోటాపోటీగా బరిలోకి దిగిన స్థానిక నేతలు

​27న ఉపసంహరణ గడువు

బుజ్జగింపుల్లో తలమునకలైన అధిష్టానం


ప్రజాశక్తి- రణస్థలం

స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో అధికార కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) పార్టీల మధ్య సమన్వయ లోపం బట్టబయలైంది. రాష్ట్రస్థాయిలో పొత్తుల మాట ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని 25 ఎంపిటిసి స్థానాలకుగాను కూటమిలోని మూడు పార్టీల నుంచి ఏకంగా 71 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


​లెక్కకు మించి నామినేషన్లు

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే మండలంలో సీట్ల సర్దుబాటుపై కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తమకే సీటు కావాలంటూ మూడు పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ఉన్నది 25 ఎంపిటిసి స్థానాలే అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా 42 మంది, జనసేన నుంచి 17 మంది, బిజెపి నుంచి 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒకే పార్టీ నుంచి ఒకే స్థానానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు వేయడంతో పాటు, మిత్రపక్షాల అభ్యర్థులపైనే పోటీకి సై అనడం కూటమిలోని అంతర్గత కుమ్ములాటలకు అద్దం పడుతోంది.


​అధిష్టానానికి తలనొప్పిగా మారిన రెబల్స్

సొంత పార్టీ నేతలు, మిత్రపక్షాల కేడర్ ఎవరికి వారే నామినేషన్లు వేయడంతో నియోజకవర్గ ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరిని బరిలో ఉంచాలి, ఎవరిని తప్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేస్తే.. అసంతృప్త నేతలు ఎన్నికల్లో సహకరించకపోగా, లోపాయికారీగా ప్రత్యర్థులకు మద్దతు ఇస్తారేమోనన్న ఆందోళన కూటమి పెద్దలను వెంటాడుతోంది.


​అందరి చూపు 27వ తేదీ వైపే

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ తుది గడువు కావడంతో, అప్పటిలోగా అసంతృప్తులను బుజ్జగించేందుకు ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. బుజ్జగింపుల పర్వం ఫలిస్తుందా? లేక కూటమి అభ్యర్థులే రెబల్స్‌గా మారి పరస్పరం తలపడతారా? అనేది 27వ తేదీ సాయంత్రానికి తేలనుంది. అప్పటివరకు రణస్థలం మండల రాజకీయం ఉత్కంఠభరితంగా సాగనుంది.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్