సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమాజ హితమే 'కా.రా' కథలు

1 గంట క్రితం

సమాజ హితమే 'కా.రా' కథలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 07:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అరసవల్లి

సమాజ హితమే కా.రా మాస్టారు కథలు అని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలోని కథానిలయంలో కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు (కా.రా) 102వ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ చెల్లాచెదురుగా ఉన్న కథా సాహిత్యాన్ని ఒకే చోట చేర్చే యజ్ఞంలో కథా తపస్వి కా.రా మాస్టారు అని అన్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా సాహితీ సేవకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన సాహితీ సేవకు ప్రతిరూపంగా కథానిలయం ఏర్పడిందన్నారు. తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట స్థానం కలిగిన కథా ప్రక్రియకు కారా మాస్టారు ఒక అక్షరధామం అని అన్నారు. తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియ సంపదను అందిస్తున్న భాండాగారమే కథా నిలయమన్నారు. సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా కథలు రాయడమే కా.రా మాస్టారులో ఉన్న విలక్షణమైన ప్రావీణ్యత ఉందన్నారు.


తెలుగు రచయితల వేదిక అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆర్.రమణమూర్తి మాట్లాడుతూ కారా మాస్టారు జీవితమంతా కథల గురించి ఆలోచించి, కాలమంతా కథ కోసమే వెచ్చించారని అన్నారు. కా.రా మాస్టారు భౌతికంగా లేకపోయినా ఆయన కథలు, కథలన్నీ నిక్షిప్తం చేసిన కథా నిలయం ఉందన్నారు. కవి, రచయిత నల్లి ధర్మారావు మాట్లాడుతూ కథ కంచికి పోకుండా కథానిలయానికి చేరుకునేలా దాన్ని స్థాపించారని తెలిపారు. అనంతరం గంటేడ గౌరునాయుడు రచించిన 'మాస్టారితో నేను' పుస్తకాన్ని అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కథానిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, కా.రా సుబ్బారావు, కంచరాన భుజంగరావు, పి.వి నరసింహారావు, కె.ఉదయ్ కిరణ్, చింతాడ తిరుమలరావు, బాడాన శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్