ప్రజాశక్తి- కోటబొమ్మాళి
టెక్కలి ప్రాంతానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందిన టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం తైక్వాండో క్రీడాకారులు, శిక్షకుడు నర్సిపురం శేఖర్ బృందాన్ని మంత్రి సోమవారం అభినందించారు. ఈ ఏడాది ఆగస్టు 9న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి చెందిన క్రీడాకారులు, కోచ్ నర్సిపురం శేఖర్‌తో పాటు మెండ తపస్వి (బ్లాక్ బెల్ట్), తమిరె జ్ఞానదీప్, అట్టాడ మహీధర్ నాయుడు పాల్గొని అరుదైన ప్రపంచ రికార్డు సాధన కోసం తమ ప్రతిభను చాటారు. ఈ ఘనతను అధికారికంగా ధ్రువీకరిస్తూ లండన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్లు, బంగారు పతకాలను పంపించింది. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.







కామెంట్లు (0)