ప్రజాశక్తి- ఇచ్ఛాపురం
అక్వాన్ తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రత్యేక అధికారి పి.వెంకటగోపాల్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి సూచించారు. మంగళవారం మండలస్థాయి అధికారులతో ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుపాను ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సిబ్బంది, యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు వంటి కనీస సదుపాయాలు కల్పించాలని సూచించారు. రహదారులకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో తహశీల్దార్ వెంకటరావు, ఎంపిడిఒ ప్రభాకరరావు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)