ప్రజాశక్తి- బూర్జ
రైతుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎఫ్ఎస్ నూతన మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని మండల వ్యవసాయ అధికారిని డి.ఉషారాణి మంగళవారం తెలిపారు. నవంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా తమ ఫోన్ నుంచే ఎరువులను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆధార్ నంబర్ లేదా ఎపిఎస్ఆర్ ఫార్మర్ ఐడి ద్వారా, ఆధార్‌కు లింకైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఒటిపి సహాయంతో లాగిన్ అవ్వాలని తెలిపారు. యాప్‌లో రైతు భూమి సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలను సరిచూసుకొని, సాగు చేస్తున్న పంటను ఎంచుకోవాలని, వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సుల మేరకు ఆ పంటకు అవసరమైన ఎరువుల మోతాదును యాప్ స్వయంగా లెక్కించి చూపిస్తుందన్నారు. అవసరమైతే రైతులు అందులో మార్పులు చేసుకోవచ్చని సూచించారు. దగ్గరలో ఎరువులు అందుబాటులో ఉన్న రిటైల్ కేంద్రాన్ని ఎంచుకుని బుకింగ్ పూర్తి చేయగానే, స్క్రీన్‌పై బుకింగ్ ఐడి, క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతాయని, రైతు స్వయంగా గానీ, లేదా తను సూచించిన ప్రతినిధి గానీ సంబంధిత ఎరువుల దుకాణానికి వెళ్లి ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే డీలర్ ఈ-పాస్ యంత్రంతో కోడ్‌ను స్కాన్ చేసి, నగదు చెల్లించిన వెంటనే ఎరువులను అందజేస్తారన్నారు. ఫార్మర్ ఐడి లేని రైతులు తక్షణమే సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి ప్రభుత్వ పథకాలకు ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే మ్యుటేషన్ కాని వారసత్వ భూములు, కౌలు రైతులు, పంట వాటాదారులు, ఆర్.ఒ.ఎఫ్.ఆర్ పట్టాదారులు, దేవాదాయ, లంక, నాన్-వెబ్ ల్యాండ్ సాగుదారులు కూడా రైతు సేవా కేంద్రం, వ్యవసాయ అధికారుల ఆమోదంతో తమ సాగు భూమిని యాప్‌లో మ్యాపింగ్ చేసుకుని ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఈ నూతన విధానం వల్ల రైతులకు సకాలంలో, పారదర్శకంగా ఎరువులు అందుతాయని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.







కామెంట్లు (0)