మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల నిర్వహణకు ముందస్తు భద్రతా చర్యలు : ​ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి

6 రోజుల క్రితం

ఎన్నికల నియమావళి తప్పనిసరి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ

జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో, రెండో దశలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్‌పి కె.వి.మహేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో దశ ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ దశలో మొత్తం 13 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, టెక్కలి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం మొత్తం 13 మండలాల్లో ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల 100, 200 మీటర్ల పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, సిసి కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. గ్రామాల్లో మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించాలని తెలిపారు.


​నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించాలి

పోలీసు అధికారులు తమ పరిధిలోని నామినేషన్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతూ, అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ నామినేషన్లు దాఖలు చేసుకున్నలే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్