శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తప్పిన ముప్పు.. తప్పని పంట నష్టం

20 నవంబర్, 2026

తప్పిన ముప్పు.. తప్పని పంట నష్టం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:11 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

'అక్వాన్'తో ఉద్దానంలో భారీ వర్షాలు

నీటమునిగిన వరి పంట

నేలకూలిన కొబ్బరి, జీడిచెట్లు

బాహుదాకు వరద నీటి ప్రవాహం


ప్రజాశక్తి - ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి

ఇచ్ఛాపురంలో తీరం దాటుతుందనుకున్న అక్వాన్ తుపాను... ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో శుక్రవారం తీరం దాటడంతో జిల్లా ప్రజలు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తుపాను ముప్పు నుంచి బయటపడ్డామన్న ఊరట ఉద్దానం రైతాంగానికి మాత్రం ఎంతోసేపు నిలవలేదు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. గురువారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షం అన్నదాతలను మళ్లీ కష్టాల్లోకి నెట్టింది. నాలుగు గంటల వ్యవధిలోనే సుమారు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వరి పొలాలు నీట మునిగాయి. పలుచోట్ల పంట నేలకొరిగింది. ఈదురుగాలుల ప్రభావానికి కొబ్బరి, జీడి తోటల్లో చెట్లు వేళ్లతో సహా నేలవాలాయి. తుపాను తీవ్రత తగ్గినా వర్షాల రూపంలో పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఇచ్ఛాపురం ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


తుపాను ప్రభావంతో ఉద్దానం ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల వ్యవధిలో ఇచ్ఛాపురంలో అత్యధికంగా 184.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కంచిలిలో 152 మి.మీ, కవిటిలో 149.2 మి.మీ, సోంపేటలో 130.4 మి.మీ, పలాసలో 100.8 మి.మీ వర్షం పడింది. వజ్రపుకొత్తూరులో 47.4 మి.మీ, మందసలో 35.4 మి.మీ, టెక్కలిలో 24.7 మి.మీ, నందిగాంలో 16.8 మి.మీ, మెళియాపుట్టిలో 15.4 మి.మీ వర్షం కురిసింది. పోలాకి, కొత్తూరు మండలాల్లో అత్యల్పంగా 0.6 మి.మీ చొప్పున వర్షం పడింది.


రైతాంగానికి తప్పని నష్టాలు

తుపాను ప్రభావం ఉద్దానం ప్రాంతంపై తీవ్రంగా పడింది. పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో కురిసిన కుండపోత వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో వరి కంకులు తడిసి, పంట నేలకొరిగింది. గింజ గట్టిపడే దశలో పంట పడిపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు ఇచ్ఛాపురం మండలంలో 732.5 ఎకరాల్లో, కంచిలి మండలంలో సుమారు 400 ఎకరాల్లో, కవిటి మండలంలో 75 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల వ్యవసాయ అధికారులు అజయ్ కుమార్, పిరియా శ్రీదేవి, సురేష్ ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. పొలాల్లోని గట్లను తొలగించి, నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్లేలా చేయాలని సూచించారు. గింజ గట్టిపడే దశలో నేలకొరిగిన వరి మడుల్లో ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు.

బాహుదాకు వరద నీటి ప్రవాహం

ఇచ్ఛాపురం ప్రాంతాన్ని బాహుదా నది వరద భయం వెంటాడింది. స్థానికంగా కురిసిన భారీ వర్షాలకు తోడు ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో అధిక వర్షపాతం నమోదవడం, ఒడిశాలోని భగలొట్టి డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బెల్లుపడ రహదారిపై కొంతమేర వరదనీరు ప్రవహించడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాహుదా నది ప్రవాహాన్ని అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా పరిశీలించారు. ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి వేణుగోపాలరావు, తహసీల్దార్ వెంకటరావు, ఇరిగేషన్ ఎఇ పాణిగ్రాహి, సిఐ ఎం.చిన్నంనాయుడు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి 35,600 క్యూసెక్కులుగా ఉన్న బాహుదా వరద ఉధృతి రాత్రికి 35 వేల క్యూసెక్కులకు తగ్గింది.


చెప్పే నీటికి.. వచ్చే నీటికి తేడా ఉందా?

బాహుదా వరదల విషయంలో ప్రజల్లో మరో కీలక సందేహం వ్యక్తమవుతోంది. ఒడిశాలోని భగలొట్టి డ్యాం నుంచి ఎంత నీటిని విడుదల చేస్తున్నారు? ఎప్పుడు గేట్లు ఎత్తుతున్నారు? ఎంతసేపు నీటి విడుదల కొనసాగుతుంది? అనే వివరాలు దిగువ ప్రాంత ప్రజలకు ముందస్తుగా అందుతున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలు, డ్యాం నుంచి విడుదలయ్యే నీటి పరిమాణం రెండూ నదీ ప్రవాహంపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో నీటి విడుదల వివరాలను ఇరు రాష్ట్రాల అధికారులు ఎప్పటికప్పుడు పరస్పరం పంచుకోవాల్సిన అవసరం ఉంది. ముందస్తు సమాచారం అందితే దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడానికి, పంటలు, ఆస్తుల నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు అవసరమే. అయితే ఇవి తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే. తరచూ ముంపునకు గురవుతున్న ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించి కరకట్టలను పటిష్టం చేయడం, వరదనీటి ప్రవాహ మార్గాలను అభివృద్ధి చేయడం, అవసరమైన చోట డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం వంటి శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్దానం ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్