శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విపత్తుల వలయంలో ఉద్దానం

6 రోజుల క్రితం

విపత్తుల వలయంలో ఉద్దానం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కవిటి:

ఒక విపత్తు నుంచి కోలుకోకముందే మరో విపత్తు.. ఇలా వరుస ప్రకృతి ప్రకోపాలతో ఇచ్చాపురం నియోజకవర్గ రైతాంగం విలవిల్లాడుతోంది. అర్నాబ్, మురుసు, అర్నావ్ తుఫాన్లు ఉద్దానం వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నియోజకవర్గంలో సుమారు 7500 వేల కొబ్బరి చెట్లు నేలకొరగ్గా, పలు తోటల్లో జీడి చెట్లు దెబ్బతిన్నాయి. 30 హెక్టార్లలో కూరగాయల పంటలు నష్టపోయాయి. వరి సాగుదారులకూ భారీ నష్టం వాటిల్లింది.

​

కుదేలైన రైతన్న

సెప్టెంబరులో అల్పపీడనం కారణంగా 1,731 మంది రైతులకు చెందిన 350 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. అక్టోబరులో అర్నాబ్ తుఫానుకు 6,223 మంది రైతులకు చెందిన 1,503 హెక్టార్లలో పంట నష్టపోయింది. తాజాగా అర్నావ్ తుఫాను ప్రభావంతో నాలుగు మండలాల్లోని 68 గ్రామాల్లో 693 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలతో ఇచ్చాపురం మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురై ప్రజలు తాగునీరు, ఆహారం కోసం ఇబ్బందులు పడ్డారు.


సాగు భారం.. భవిష్యత్తుపై దిగులు

పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత, తగ్గుతున్న దిగుబడులతో ఇప్పటికే సతమతమవుతున్న రైతులకు వరుస విపత్తులు మరింత భారంగా మారాయి. మిగిలిన వరి పంటలోనూ పొల్లు గింజలు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి, జీడి తోటలకు జరిగిన నష్టం రాబోయే నెలల్లోనూ ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కొబ్బరి దిగుబడులు మరో ఆరేడు నెలలపాటు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీంతో ప్రస్తుత పంట ఆదాయమే కాకుండా భవిష్యత్తు ఆదాయంపైనా రైతులు ఆశలు కోల్పోతున్నారు.


రైతును కోలుకోనివ్వడం లేదు

నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. కొత్త రకం వంగడాలతో తక్కువ ఎరువులు వినియోగించి నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటాను. అయినా ఏటా విపత్తులు, అననుకూల పరిస్థితులతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. కూలీల కొరత, తగ్గుతున్న దిగుబడులు అదనపు భారంగా మారాయి. ఈ ఏడాది వరుస తుఫాన్లతో చాలామంది రైతులు పంటలు కోల్పోయారు. మిగిలిన పంటలోనూ పొల్లు గింజలు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది. కొబ్బరి, జీడి తోటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. కొబ్బరి దిగుబడులు మరో ఆరేడు నెలలు తగ్గే ప్రమాదం ఉంది. తీరప్రాంతంలో ఉండటంతో వ్యవసాయ, ఉద్యాన పంటలు రెండూ దెబ్బతింటున్నాయి. ఏటా ఇలా ప్రకృతి విపత్తులు వెంటాడుతుంటే రైతు ఎలా కోలుకుంటాడు?

బెందాలం వరం, రైతు, ప్రగడపుట్టుగ

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్