ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్
పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాలకు ప్రశాంతి నిలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మంగళవారం నాడు ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాలుతో పాటు సాయి మందిరం పరిసరాల్లో విద్యుత్ రంగుల అలంకరణతో పాటు తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. బుధవారం నాడు వేణుగోపాల స్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. ప్రతిఏటా సాయి జయంతి వేడుకలకు రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హనుమాన్ సర్కిల్ నుంచి ప్రశాంతి నిలయం వరకు రథంలో ప్రతిష్టించిన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని భక్తులు ఉత్సాహంగా రథం లాగి తమ భక్తిని చాటుకుంటారు. హనుమాన్ సర్కిల్ నుంచి ప్రశాంతి నిలయం వరకు ఈ రథాన్ని లాగుతారు. ప్రశాంతి నిలయంలో పూజలు అనంతరం అక్కడి నుంచి సీతారాముల విగ్రహాలను రథంలో ప్రతిష్టించి తిరిగి వేణుగోపాలస్వామి గుడి వరకు రథం చేరుకుంటుంది. ఈ రథోత్సవం వేడుకలలో దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో పాటు పుట్టపర్తి పరిసర గ్రామాల ప్రజలు వేలాది మంది పాల్గొంటారు. ఈ రథం ఊరేగింపు ముందు కీలు గుర్రాలు, చెక్కభజనలు కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ దేవత మూర్తుల వేషధారణలతో ఈ వేడుకలు కోలాహలంగా కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొననున్నారు. ఇలా ఉండగా మంగళవారం సాయంత్రం సాయి కుల్వంత్ హాలులో ప్రముఖ విద్వాంసుడు రాకేష్ చేలా సియా నిర్వహించిన సంగీత కచేరి భక్తులను ఆకట్టుకుంది.








కామెంట్లు (0)