-సామాజిక వర్గాల ఒత్తిళ్లు.. నేతల మధ్య అభిప్రాయ భేదాలు
-వైస్ చైర్మన్ రేసులో రావిళ్ల లక్ష్మి పేరు!
నూతన ఛైర్మన్ అభ్యంతరంతో పెరిగిన ఉత్కంఠ
హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న అధికార పార్టీకి ఇప్పుడు వైస్ చైర్మన్ ఎంపిక తలనొప్పిగా మారింది. చైర్మన్ స్థానాన్ని ఓటర్లు నేరుగా ఎన్నుకోగా.. వైస్ చైర్మన్ పదవిని మాత్రం ఎన్నికైన కౌన్సిలర్లు ఎన్నుకోవాల్సి ఉంది. దీంతో ఈ పదవి ఎవరిని వరించనుందన్న అంశం అధికార పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముస్లిం మైనారిటీ, బోయ, దళిత తదితర సామాజిక వర్గాలు తమకే అవకాశం కల్పించాలని పట్టుబడుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార పార్టీ నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 23న నూతన మున్సిపల్ చైర్మన్ పురిడి మంజునాథ ప్రమాణ స్వీకారం జరగనుంది. అదే రోజు వైస్ చైర్మన్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. దీంతో ఈ పదవి ఎవరిని వరించనుందో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ముస్లిం మైనారిటీ, బోయ, దళిత సామాజిక వర్గాలకు చెందిన నాయకులు తమకు అవకాశం కల్పించాలని పార్టీ ముఖ్య నాయకులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా వర్గాల నాయకులు తమ సామాజిక వర్గానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యతను వివరిస్తూ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయినప్పటికీ అధికార పార్టీ ఇప్పటివరకు అభ్యర్థి పేరును ప్రకటించలేదు. మరోవైపు గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన రావిళ్ల లక్ష్మిని వైస్ చైర్మన్‌గా ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రతిపాదనపై నూతన చైర్మన్ పురిడి మంజునాథ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే ముదిరెడ్డిపల్లిలో జరిగిన ప్రత్యేక సమావేశానికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆమెకు వైస్ చైర్మన్ పదవి కేటాయిస్తే తాను ప్రమాణ స్వీకారం చేయనని ఆయన స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం అధికార పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది. ఒకవైపు సామాజిక వర్గాల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు.. మరోవైపు పార్టీ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు.. ఇంకోవైపు చైర్మన్ అభ్యంతరాల ప్రచారం.. వెరసి వైస్ చైర్మన్ ఎంపిక అధికార పార్టీకి అగ్నిపరీక్షగా మారింది. చైర్మన్ పదవిని నేరుగా ప్రజల తీర్పుతో దక్కించుకున్న అధికార పార్టీకి, వైస్ చైర్మన్ ఎన్నికలో మాత్రం సొంత కౌన్సిలర్ల మద్దతును కూడగట్టుకోవడం కీలకంగా మారనుంది. ఈ నెల 23న జరగనున్న ఎన్నికతో ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తారా... సీనియారిటీకి పట్టం కడతారా... లేక పార్టీ పెద్దల నిర్ణయమే తుది నిర్ణయమవుతుందా అన్నది హిందూపురం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వైస్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో, అధికార పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత అసంతృప్తికి నాయకత్వం ఎలా తెరదించుతుందో తెలియాలంటే ఈ నెల 23 వరకు వేచి చూడాల్సిందే.







కామెంట్లు (0)