గతంలో వైద్యుల ఆందోళన.. డీఎంహెచ్‌వో స్థాయిలోనూ విచారణ
హిందూపురం పట్టణంలోని ధన్య గ్లోరీ ఆసుపత్రి మరోసారి అధికారుల తనిఖీలతో చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నకిలీ వైద్యుల నిరోధక కమిటీ ప్రత్యేక బృందం శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. కమిటీ సభ్యుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, నిర్వహణ, సంబంధిత రికార్డులను పరిశీలించి పూర్తి వివరాలను నమోదు చేశారు. తనిఖీల నివేదికను ఏపీ మెడికల్ కౌన్సిల్లో చర్చించిన అనంతరం సంబంధిత అధికారులకు అందజేసి, చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. గతంలో వైద్యుల ఆందోళన.. డీఎంహెచ్‌వో విచారణతో ధన్య గ్లోరీ ఆసుపత్రి వ్యవహారం గతంలోనూ వివాదాలకు దారితీసింది. ఆసుపత్రి నిర్వాహకులు కొంతమంది వైద్యులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు రావడంతో అప్పట్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో వైద్యులంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై అప్పటి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జోక్యం చేసుకొని వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆసుపత్రిపై విచారణ కూడా నిర్వహించింది. గతంలో వైద్యుల ఆందోళనకు దారితీసిన ఈ ఆసుపత్రిపై తాజాగా మరోసారి ఫిర్యాదులు రావడం, ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నకిలీ వైద్యాన్ని అరికట్టేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ఏపీఎంసీ సెక్షన్ 20, ఎన్ఎంసీ సెక్షన్ 34 నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించినట్లు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అనుమానాస్పద వైద్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమ వైద్యం జరుగుతున్నట్లు ఆధారాలు లభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హత కలిగిన వైద్యులకు రిజిస్ట్రేషన్ రెన్యువల్, క్రెడిట్ అవర్స్ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌కు ఇంటర్న్‌షిప్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవలు అందించే వైద్యులకు మెడికల్ కౌన్సిల్ అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారి ఆశ, కౌన్సిల్ సిబ్బంది రంజిత్ పాల్గొన్నారు.







కామెంట్లు (0)