టిప్పుసుల్తాన్ వారసుడు సయ్యద్ మన్సూర్ అలీ టిప్పు, రవిశంకర్ గురూజీ
ప్రజాశక్తి–హిందూపురం
దేశ సమైక్యత, మతసామరస్యం, సోదరభావం కోసం మహావీరుడు షహీద్ టిప్పుసుల్తాన్ చేసిన పోరాటం, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని టిప్పుసుల్తాన్ ఏడో తరం వారసుడు సయ్యద్ మన్సూర్ అలీ టిప్పు, మహా ఆచార్య శ్రీ రవిశంకర్ గురూజీ పేర్కొన్నారు. హిందూ ముస్లింల ఐక్యతతో పాటు వివిధ మతాల మధ్య పరస్పర గౌరవం, సహనం, ఐకమత్యం దేశాభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. పట్టణంలోని ఏఎంఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన ‘మహావీరుడు షహీద్ టిప్పుసుల్తాన్ జయంత్యుత్సవాలు’లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అఖిల భారత షహీద్ టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కల్లూరు ఉమర్ ఫరూఖ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మైసూరు షహీద్ టిప్పుసుల్తాన్ ఏడో తరం వారసుడు, తెహ్రిక్-ఎ-ఖుదాదాద్ జాతీయ అధ్యక్షుడు సాహెబ్జాదా సయ్యద్ మన్సూర్ అలీ టిప్పు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా మహా ఆచార్య శ్రీ రవిశంకర్ గురూజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ మన్సూర్ అలీ టిప్పుకు షహీద్ టిప్పుసుల్తాన్ జాతీయ పురస్కారం–2026ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవిశంకర్ గురూజీ, సయ్యద్ మన్సూర్ అలీ టిప్పు మాట్లాడుతూ మాతృభూమిని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి టిప్పుసుల్తాన్ రాజీలేని పోరాటం సాగించారని గుర్తుచేశారు. హిందూ ముస్లిం ఐక్యతకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని, శృంగేరి శారదా మాత పీఠాన్ని రక్షించి పునఃప్రతిష్ఠకు సహకరించారని తెలిపారు. వందలాది దేవాలయాలకు సహాయ సహకారాలు అందించడంతో పాటు దేవాలయాలకు వేలాది ఎకరాల భూములను కేటాయించారని పేర్కొన్నారు. మతసామరస్యం, పరమత సహనం, సోదరభావం, వసుధైక కుటుంబ భావన వంటి విలువలకు ఆయన జీవితం నిదర్శనమన్నారు. నేటి సమాజంలో మతాల మధ్య ఐక్యతను కాపాడుకుంటూ భారతదేశ అభివృద్ధి, జాతీయ సమైక్యత, దేశ సుస్థిరత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జేవీ అనిల్ కుమార్, డీఈ రమేష్ కుమార్, చేనేత కార్మిక నాయకుడు ఏసీ నాగరాజు, క్రైస్తవ సంఘం పెద్దలు నాగేంద్ర కుమార్, సిక్కు సంఘం పెద్దలు పల్వేందర్ సింగ్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు జేపీకే రాము, గిరిజన సంఘం నాయకులు, సున్నీ జమాత్ మౌలానా షాబుద్దీన్, అహ్లే హదీస్ మౌలానాలు ఇస్మాయిల్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మతాలు, సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులంతా ఒకే వేదికపైకి వచ్చి హిందూ ముస్లిం ఐక్యతను చాటారు. హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి, మహావీరుడు షహీద్ టిప్పుసుల్తాన్ ఆశయాలు వర్ధిల్లాలి, జోహార్ షహీద్ టిప్పుసుల్తాన్ అంటూ చేతులెత్తి నినాదాలు చేశారు. దీంతో సభా ప్రాంగణం ఐక్యతా నినాదాలతో మార్మోగింది. విద్యార్థుల్లో దేశభక్తి, చారిత్రక అవగాహన, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న 500 మంది విద్యార్థులకు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో 300 మంది విద్యార్థులు టిప్పుసుల్తాన్ వేషధారణ పోటీల్లో పాల్గొనగా, మరో 200 మంది వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం తదితర పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులను అతిథులు అభినందించి పురస్కారాలు అందజేశారు. వివిధ మతాల ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి.








కామెంట్లు (0)