ప్రజాశక్తి-కదిరి టౌన్
వైసీపీ నేతల తప్పుడు ఆరోపణలను మేధావులు, ప్రజలు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా వారిలో మార్పు లేదని మండిపడ్డారు. పట్టణంలోని తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక కౌంటింగ్‌పై వైసీపీ నేతల తప్పుడు ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కౌంటింగ్, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లానని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తాను కౌంటింగ్ కేంద్రం వైపు కూడా వెళ్లలేదన్నారు.
దమ్ముంటే నిరూపించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. వైసిపి నేతలు ఓటమిని జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించకుండా పదవుల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేసిన దౌర్జన్యాలను ప్రజలు ఇప్పటికీ మరువ లేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూటమి నాయకులు కలిసి మెలిసి ఎన్నికల ప్రచారం చేపట్టి విజయఢంకా మోగించాలని సూచించారు. ఎవరైనా ప్రజాస్వామానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.








కామెంట్లు (0)