ప్రజాశక్తి-గుడిబండ
సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలోని చిగతూర్పి గ్రామ నూతన ఎస్సీ కాలనీలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. గుక్కెడు నీటి కోసం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో శుక్రవారం కాలనీవాసులు విధి లేని పరిస్థితుల్లో రోడ్డెక్కారు. మహిళలు, పిల్లలు, పెద్దలు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప, రాళ్లు వేసి ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో గుడిబండ-అమరాపురం మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మహిళలు మాట్లాడుతూ గ్రామంలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్య నెలకొందన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయడం లేదన్నారు. దీంతో గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేదని వాపోయారు.సంబంధిత అధికారులు వచ్చి హామీ ఇర్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ కార్యదర్శి మంజునాథ్ అక్కడికి చేరుకొని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.




కామెంట్లు (0)