రేణిగుంట అర్బన్ సి.ఐ జయచంద్ర కు ఐద్వా ఫిర్యాదు!!
రేణిగుంట మద్యం దుకాణాలు ప్రజలకు_ మహిళల భద్రతకు_ భక్తుల మనోభావాలకు ఇది విరుద్ధం!!!
రేణిగుంట (తిరుపతి) : తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన రెండు మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ఫిర్యాదు చేస్తూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) రేణిగుంట మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు రేణిగుంట సి.ఐ జయచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ, మండల అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ, రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో "సర్వేశ్ వైన్" షాప్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం సర్కిల్ సమీపంలో "ఆద్య వైన్స్" పేరుతో కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ దుకాణాలు జనావాస ప్రాంతంలో, పాఠశాలలు, దేవాలయాలు, రేణిగుంట రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండడం వల్ల మహిళలు, విద్యార్థులు, చిన్నారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాలను ప్రజల అభ్యంతరాల మేరకు తొలగించారని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు రేణిగుంట రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ద్వారా ప్రయాణించే నేపథ్యంలో ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలు కొనసాగించడం ప్రజా ప్రయోజనాలకు, మహిళల భద్రతకు, భక్తిశ్రద్ధలతో వచ్చే భక్తుల మనోభావాలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని పై రెండు మద్యం దుకాణాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఐద్వా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ, ఐద్వా మండల అధ్యక్షురాలు భారతి, సులోచన, పద్మ, సుజాత, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ పాల్గొని సీఐ జయచంద్రకు వినతిపత్రం అందజేశారు.







కామెంట్‌లు (0)