టీడీపీ రీకౌంటింగ్ కోరడంతో ఆరు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపు ప్రకటన
పోలీసులు, వైసిపి నాయకుడి మధ్య వాగ్వాదం
ప్రజాశక్తి,నాయుడుపేట:- తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని 2వ వార్డు ఎన్నికల ఫలితంపై వివాదం చోటుచేసుకుంది. తొలుత ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించినట్లు ప్రకటించగా, టీడీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరడంతో మరోసారి ఓట్ల లెక్కింపు చేపట్టారు.రీకౌంటింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు.అయితే కౌంటింగ్ కేంద్రం వద్దకు వస్తున్న సంజీవయ్యను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఈ పరిణామంతో నాయుడుపేట మున్సిపాలిటీ 2వ వార్డు వద్ద రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు, రీకౌంటింగ్ ప్రక్రియపై అధికారుల వివరణతో పాటు తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంలో నాయుడుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా మారి అరాచకాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.అర్బన్ సీఐ వెంకటరమణ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ నాయకుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతు ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసు శాఖలో పనిచేస్తున్న సీఐ వెంకటరమణ పట్టణంలో అనేక వివాదాలకు కారణం అవుతున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.







కామెంట్లు (0)