ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : జిఒ నెంబర్ 396 ను వెంటనే ఉపసంహరించుకోవాలని చంద్రగిరి దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని తిరుపతి జిల్లా చంద్రగిరి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపి డిమాండ్ చేశారు. 8వ రోజు సోమవారం కొనసాగుతోన్న నిరసన కార్యక్రమంలో గోపి మాట్లాడుతూ .... రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం ఆర్.ఎస్.కె (RSK) సెంటర్లను తీసుకురావాలని చూస్తోందని ఆరోపించారు. ఆర్.ఎస్.కె సెంటర్ల ద్వారా సేవలను పారదర్శకంగా, వేగంగా అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అటువంటి వేగవంతమైన స్లాట్ బుకింగ్ సేవలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖలో అందుబాటులో ఉన్నాయని, వాటిని తాము ప్రజలకు విజయవంతంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కొత్త జీవో ద్వారా ప్రజలకు అదనంగా చేకూరే పారదర్శకత కానీ, వేగవంతమైన సేవలు కానీ ఏమీ లేవని, కేవలం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యమై, దస్తావేజు లేఖరుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంవారు మరొక్కసారి ఈ విషయంపై పునరాలోచించి, జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్స్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
8వ రోజు - దస్తావేజు లేఖరుల నిరసన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 03:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)