సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన విద్యార్థి శివానీ మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి : వి.శ్రీనివాసరావు

1 గంట క్రితం

Meeting in Vijayawada tomorrow demanding Dharmendra Pradhan's resignation: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీకి చెందిన గిరిజన విద్యార్థిని ముర్రం శివానీ (15) అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని కలిగించిందని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శివానీ మృతి అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల రంపచోడవరంలో జరిగిన ‘మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్’లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి, తన వాక్చాతుర్యంతో అందరి ప్రశంసలు అందుకోవడమే కాక, సిఎం తో ప్రత్యేకంగా ఫోటోలు దిగిన ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న గిరిజన బాలిక ఇంతలోనే మృతి చెందడం బాధాకరం. అని అన్నారు. నిన్నటివరకు ముఖ్యమంత్రితో సహా అందరి చేత ప్రశంసలు పొంది, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఒక విద్యార్థిని ఉన్నట్టుండి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అంతటి ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో పాల్గొన్న చిన్నారిని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఏమిటి.. ? ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడికి కారణాలు ఏమిటి... ? అనే అంశాలపై సమగ్రంగా, నిష్పాక్షికంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఇతర ప్రతికూల పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముర్రం శివానీ మృతి వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టడానికి ఉన్నత స్థాయి నిపుణులు, విద్యావేత్తలతో విచారణ జరిపించాలనీ, శివానీ కుటుబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఆ కుటుంబానికి తక్షణమే రూ. 25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గిరిజన, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించేందుకు, ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. శోకసంద్రంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు, సహచర విద్యార్థులకు సిపిఐ(యం) పూర్తి నైతిక మద్దతు ఇస్తుందని వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

cpim



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్