బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థి జీవితంలో క్రమశిక్షణే విజయానికి పునాది

1 గంట క్రితం

tpt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 11:04 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

– డీఈఓ కె.వి.ఎన్. కుమార్

ప్రజాశక్తి-చంద్రగిరి : చంద్రగిరి మండలం, నరసింగాపురం ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి, ప్రార్థనా సమావేశంలో డీఈవో కె.వి.ఎన్. కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, నైతిక విలువలు, కష్టపడి పనిచేసే తత్వం ఎంతో కీలకమని జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్. కుమార్ అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్ విజయానికి బలమైన పునాదిగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువుపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి సారించి, పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఉపాధ్యాయులు బోధించే అంశాలను శ్రద్ధగా వినడంతో పాటు, పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలు ఉంటే వాటిని మరుసటి రోజే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

మొబైల్ ఫోన్లు, టెలివిజన్‌కు అధిక సమయం కేటాయించడం వల్ల చదువుపై ప్రభావం పడే అవకాశం ఉందని, విద్యార్థులు వాటికి దూరంగా ఉంటూ తమ విలువైన సమయాన్ని చదువుకు, జ్ఞానాభివృద్ధికి వినియోగించుకోవాలని డీఈఓ సూచించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఎస్.ఎస్.సి మిషన్ మార్చ్ 2027ను లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి నుంచే క్రమబద్ధమైన ప్రణాళికతో చదువుకోవాలని, ప్రతిరోజూ పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే ఆశించిన ఫలితాలను సాధించవచ్చని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులు సామాజిక బాధ్యత, ఐకమత్యం, పరస్పర సహకారం, ఇతరులకు సహాయం చేసే గుణం వంటి నైతిక విలువలను అలవర్చుకోవాలని డీఈఓ సూచించారు. భవిష్యత్తులో సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి విద్యతో పాటు మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, నైతిక విలువలు అవసరమని పేర్కొన్నారు. సమయపాలనను జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుని, ప్రతి రోజును ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచిస్తూ, క్రమశిక్షణతో కూడిన విద్యార్థి జీవితం విజయవంతమైన భవిష్యత్తుకు మార్గం చూపుతుందని డీఈఓ కె.వి.ఎన్. కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హైమావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్