సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మట్టి గణేశుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

13 సెప్టెంబర్, 2026

ganesh.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వేమన విజ్ఞాన కేంద్రంలో మట్టి గణేశ విగ్రహాల పంపిణీ

ప్రజాశక్తి-తిరుపతి: గణేశ చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో మట్టి గణేశ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల, అధిక వర్షాలు, వరదలు, వర్షాభావం, కరువు వంటి పరిణామాలు పర్యావరణ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. పర్యావరణానికి సరిహద్దులు లేనందున దాని పరిరక్షణ బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. భారత్ ఆర్థికాభివృద్ధితో పాటు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల మాట్లాడుతూ గతంలో బంకమన్నుతో వినాయక విగ్రహాలను తయారు చేసుకుని పూజించేవారని గుర్తుచేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులు, నేల కలుషితమవుతున్నాయని తెలిపారు. మట్టి వినాయకుడిని పూజించడం సంప్రదాయ పరిరక్షణతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యతాయుతమైన చర్య అన్నారు. ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అధికారి లోకనాథం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. మల్లారపు నాగార్జున మాట్లాడుతూ మట్టి గణేశుడు సంప్రదాయానికి ప్రతీక మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సందేశమని తెలిపారు. కార్యక్రమంలో రెడ్డప్ప, డాక్టర్ కడివేటి మున్నరత్నం, రత్నశేఖర్, మునిరాజు, డాక్టర్ రవీంద్ర, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్