గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చంద్రుడిపై స్థావరానికి ఇస్రోకు నాసా పిలుపు

1 రోజు క్రితం

NASA invites ISRO for a lunar base!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి..శ్రీహరికోట(తిరుపతి): చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో మానవాళి తొలి చంద్ర స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాచేపట్టనున్న మూన్ బేస్ కార్యక్రమంలో భాగస్వామి కావాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఆహ్వానం అందింది. ఆగస్టు 5, 6 తేదీల్లో బెంగళూరులోని ఇస్రోప్రధాన కార్యాలయంలో జరిగిన భారత్ అమెరికా 9వ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో నాసా ఈ ఆహ్వానాన్ని అందించింది. ఆర్టెమిస్ అకార్డ్స్ కింద

ఇప్పటికే కొనసాగుతున్న..భారత్ అమెరికా అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా ఈ పరిణామం చోటుచేసుకుంది. చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ ఉనికికి అవసరమైన మౌలిక వసతులు, శాస్త్రీయ పరిశోధనలు, భవిష్యత్తు మానవ అంతరిక్ష యాత్రలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమంలో కీలకం కానుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3ను విజయవంతంగా దింపిన భారత్ కు తాజాగా నాసా నుంచి ఈ ఆహ్వానం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అంతరిక్ష సహకారాన్ని శాస్త్రీయ పరిశోధనలు, మానవ అంతరిక్షయానం, అంతరిక్ష సాంకేతికతల దిశగా మరింత విస్తరించేందుకు సమావేశంలో చర్చించారు. ఆర్టెమిస్ అకార్డ్స్ కింద శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం పంచుకునే అంశంపైనా ఇరు దేశాలు చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి. ఇస్రో చైర్మన్ వి. నారాయణన్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహా ఇరు దేశాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. చంద్రుడిపై పరిశోధనల నుంచి మానవ నివాసానికి అవసరమైన సాంకేతికతల అభివృద్ధి వరకు ప్రపంచ అంతరిక్ష రంగం కొత్త దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఆ ప్రయాణంలో భారత్ను భాగస్వామిగా చేసుకునేందుకు నాసా ముందుకు రావడం భారత అంతరిక్ష ప్రస్థానానికి దక్కిన మరో కీలక గుర్తింపుగా భావిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్