స్కూటర్ ర్యాలీలో సిఐటియుజిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రమణ్యం పిలుపు
తిరుపతి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, ఆశా ,అంగన్వాడి, మధ్యాహ్నం భోజనం కార్మికులను, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, గిరిజనులకు, ఆదివాసులకు అటవీ హక్కులను పరిరక్షించబడాలని, సర్ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ... గురువారం సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తేదీ నుండి మూడో తేదీ వరకు చేపడుతున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సిఐటియు తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం నుండి స్కూటర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.
ఈ సందర్భంగా టి. సుబ్రమణ్యం మాట్లాడుతూ ... కార్పొరేట్ల ప్రయోజనాల కోసం బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసింది అన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల్ని రద్దు చేయడం దుర్మార్గమన్నారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానంగా మార్చడాన్ని తప్పుపట్టారు. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా గత 15 సంవత్సరాల నుండి జీతాలు పెంచకుండా కార్మికుల్ని మోసం చేశారని అన్నారు. కనీస వేతనం 42 వేలుకు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు.
అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులను, కాంట్రాక్ట్ కార్మికులు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పి .బుజ్జి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు వల్ల మహిళా కార్మికులు రాత్రి వేళలో పనిచేయాలని నిబంధన వల్ల రక్షణ లేకుండా పోతుంది అన్నారు. ఆటో, హమాలీ, ఆటో, తోపుడుబండ్ల వ్యాపారస్తుల రక్షణ కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ బోర్డు చేసిన తీర్మానం ప్రకారం దర్శనం సౌకర్యంతో పాటు, లడ్డు, ఐడి కార్డు ఇవ్వాలని కోరారు. డిసెంబర్ ఒకటో తేదీ చేపట్టే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. స్కూటర్ ర్యాలీ పాత మున్సిపల్ ఆఫీస్ నుండి ప్రారంభమై నాలుగు కాళ్ల మండపం మీదుగా కర్నాల వీధి, గాంధీ రోడ్డు, టీకే స్ట్రీట్, టిటిడి ఎడి బిల్డింగ్ , యశోద నగర్లోని సిఐటియు కార్యాలయం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు ఆర్. లక్ష్మి, కే. వేణుగోపాల్, పి ,చిన్న, బి .శ్రీరాములు, మురళి, రమేష్, సత్యనారాయణ, గణేష్, సిద్దు, రామకృష్ణ, జయంతి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)