ఉపాధ్యాయుల కొరత, చీకట్లో తరగతులు
టీసీలు ఇచ్చి ఇతర పాఠశాలల్లో చేర్చుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రుల డిమాండ్
ప్రజాశక్తి - ఓబులవారిపల్లి : మండల పరిధిలోని చిన్న ఓరంపాడు పంచాయతీకి చెందిన ఐలరాజుపల్లి–వడ్డేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటంతో విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యాబోధన సక్రమంగా సాగడం లేదని తెలిపారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయురాలు మండలంలోని పలు పాఠశాలలకు సంబంధించిన ఆన్‌లైన్ విధుల్లో ఉంటున్నారని, దీంతో విద్యార్తులకు తగిన బోధన అందడం లేదని వాపోయారు. పాఠశాల ఆవరణలో పెరిగిన చెట్ల కారణంగా తరగతి గదుల్లో వెలుతురు సరిగా లేక ఎప్పుడూ చీకటి వాతావరణం నెలకొంటోందని చెప్పారు. విద్యుత్ దీపాలు కూడా పనిచేయకపోవడంతో పాఠ్యపుస్తకాలు చదవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో విద్యార్థులు తరగతి గదుల బయట వరండాలో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు, ఎంపీడీవో, ఎంఈఓతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అదనపు ఉపాధ్యాయులను నియమించడంతో పాటు విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని తల్లిదండ్రులు కోరారు. లేనిపక్షంలో తమ పిల్లలకు వెంటనే టీసీలు జారీ చేసి సమీపంలోని ఇతర పాఠశాలల్లో చేర్పించుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ నిరసనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)