శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఓటు హక్కుని తొలగించే ప్రక్రియ’ (ఎస్‌ఐఆర్‌)ను రద్దు చేయాలంటూ బహిరంగ లేఖ

35 నిమిషాల క్రితం

SIR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 01:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ‘ఓటు హక్కుని తొలగించే ప్రక్రియ’ (ఎస్‌ఐఆర్‌)ను రద్దు చేయాలని స్వతంత్ర శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తల బృందం డిమాండ్‌ చేసింది. ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికల సంఘం (ఇసిఐ), కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం బహిరంగ లేఖ రాసింది. ఎస్‌ఐఆర్‌ను ‘‘ఓటు హక్కు తొలగించే ప్రక్రియ’’గా వారు అభివర్ణించారు. ఈ ప్రక్రియలో అక్రమంగా తొలగించిన అర్హులైన ఓటర్లందరి పేర్లను తక్షణమే తిరిగి చేర్చాలని డిమాండ్‌ చేసింది. ఈ బహిరంగ లేఖపై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ఐఐటీ ఢిల్లీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (కోల్‌కతా), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (చెన్నై), ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరిటికల్‌ సైన్సెస్‌ (బెంగళూరు) సంస్థలకు చెందిన పలువురు పరిశోధకులు, విద్యావేత్తలు సంతకాలు చేశారు. అయితే, తాము వ్యక్తిగత హోదాలోనే ఈ ప్రకటనకు మద్దతు తెలిపామని పేర్కొన్నారు. తమ అభిప్రాయాలు యూనివర్శిటీల వైఖరికి ప్రాతినిధ్యం వహించవని వారు స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారన్న అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లను, ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, అణగారిన వర్గాలకు చెందిన వారిని ఏకపక్షంగా, తగిన సమర్థన లేకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల బాధిత పౌరులు తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు సంక్లిష్టమైన ప్రక్రియలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో పేర్లను తిరిగి చేర్చేందుకు తగిన రక్షణలు లేవని, తమ అర్హతను నిరూపించుకునేందుకు పౌరులకు అర్థవంతమైన అవకాశం కల్పించడం లేదని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని పేర్కొన్నారు. ఓటు హక్కును తొలగించే విషయంలో న్యాయమైన విధానాలను అనుసరించాలని, అర్హులైన పౌరులకు తమ హక్కును కాపాడుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మౌలిక స్తంభమని శాస్త్రవేత్తలు తమ లేఖలో స్పష్టం చేశారు. పౌరుల గొంతును అణచివేస్తే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించాలని ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య భావాలు కలిగిన వ్యక్తులు, శక్తులన్నీ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు, యువజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.


Scientists

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్