గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : గంటా సంపత్ ‌కుమార్

2 రోజుల క్రితం

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : గంటా సంపత్ ‌కుమార్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 12:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విశాఖ జిల్లా నూతన కమిటీ ఎన్నిక – ప్రభుత్వానికి పలు డిమాండ్లు


ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్–అమరావతి (ఏపీ జేఏసీ అనుబంధం) విశాఖపట్నం జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం రెవెన్యూ భవన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 11 మంది సభ్యులతో కూడిన నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని సోమవారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా టి. శ్రీనుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధు, జిల్లా ట్రెజరర్‌గా రాంబాబు ఎన్నికయ్యారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్. డిల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా వి. రమేష్, ఎస్. రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డి. మహేష్, శివకుమార్, సెక్రటరీలుగా వెంకటలక్ష్మి, అనిత, ఈసీ సభ్యురాలిగా స్వాతి ఎన్నికయ్యారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గంటా సంపత్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈడుపుగంటి మోహన్‌రావు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ, విశాఖ జిల్లా ఇన్‌చార్జి కేశవ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా గంటా సంపత్‌కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, గురుకుల పాఠశాలల్లో ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమయానికి జీతాలు అందక ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈడుపుగంటి మోహన్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు మేరకు 'సమాన పనికి సమాన వేతనం' అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ కేశవ మాట్లాడుతూ, ప్రైవేట్ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి అన్ని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఏపీకాస్ పరిధిలోకి తీసుకురావాలని లేదా ఆయా శాఖల ద్వారానే నేరుగా వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచడం, ప్రత్యేక సర్వీస్ రూల్స్ రూపొందించడం, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడం, సెర్ప్, మెప్మా ఉద్యోగులతో సమానంగా హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయడం, ప్రైవేట్ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి మెరుగైన విధానాన్ని అమలు చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీనుబాబు మాట్లాడుతూ, జిల్లాలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ సహకారంతో ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
visaka


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్