సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.200 కోట్లుతో ఉత్తరాంద్రకు చెందిన నాలుగు ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ

1 గంట క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 06:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కంచరపాలెం ఐటీఐ ప్రధాన శిక్షణ కేంద్రంగా అభివృద్ధి

- పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : పీఎం-సేతు పథకం కింద విశాఖపట్నం క్లస్టర్‌లోని నాలుగు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐ) ఆధునీకరణకు రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా (ఏఎం/ఎన్‌ఎస్‌ ఇండియా), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాటాదారుల ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టులో విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐ (పాతది), పారిశ్రామికవాడలోని ప్రభుత్వ మహిళా ఐటీఐతోపాటు బొబ్బిలి, నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. వీటిలో కంచరపాలెం ఐటీఐని ప్రధాన శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీఐల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, పరిశ్రమల్లో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా శిక్షణా కోర్సులను నవీకరించనున్నారు. కొత్త ట్రేడ్లను ప్రవేశపెట్టడం, ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం, బోధకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఏఎం/ఎన్‌ఎస్‌ ఇండియా తన సాంకేతిక భాగస్వామి నామ్‌టెక్‌ సహకారంతో ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది. దీనివల్ల విశాఖతోపాటు పరిసర ప్రాంతాల యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభించనుంది.

ఐటీఐల్లో శిక్షణ పొందే విద్యార్థులకు కేవలం సైద్ధాంతిక పరిజ్ఞానమే కాకుండా, ప్రాయోగిక నైపుణ్యాలను అందించడంపై ఈ ప్రాజెక్టులో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడం, యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. పీఎం-సేతు పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా వెయ్యి ప్రభుత్వ ఐటీఐలు, ఐదు జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పథకానికి మొత్తం రూ.60 వేల కోట్ల కేటాయింపును ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన ప్రత్యేక ప్రయోజన సంస్థలో ఏఎం/ఎన్‌ఎస్‌ ఇండియాకు 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 24.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 24.5 శాతం వాటా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ఐటీఐల ఆధునీకరణతో పాటు గుజరాత్‌లోని సూరత్‌ క్లస్టర్‌లో ఐదు ఐటీఐల అభివృద్ధికి కూడా ఏఎం/ఎన్‌ఎస్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మొత్తం తొమ్మిది ఐటీఐలను అభివృద్ధి చేయనుండగా, ఆమోదించిన పెట్టుబడి రూ.440 కోట్లుగా ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్