విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు : ఎంపీ శ్రీభరత్
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : అర్నబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వందలాది చెట్లు, 300కు పైగా రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. గురువారం విశాఖలో నిర్వహించిన కూటమి మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి, కూటమి మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి లతో కలిసి శ్రీభరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుద్‌హుద్‌తో పోలిస్తే నష్టం తక్కువగా ఉందని, తుపాను అనంతరం విద్యుత్ పునరుద్ధరణ, రహదారుల క్లియరెన్స్ పనుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు మరణించడం బాధాకరమని, ప్రస్తుతం వాతావరణం సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని శ్రీభరత్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్ల సహాయం అందించామని, నీరు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలకు రూ.4 వేల కోట్లు, రహదారులకు రూ.800 కోట్లు, జీవీఎంసీ పనులకు రూ.400 కోట్లు కేటాయించినట్లు వివరించారు. సుమారు 60 ఐటీ కంపెనీల ద్వారా లక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశాలున్నాయని, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, ఏఐజీ ఆస్పత్రి వంటి ప్రాజెక్టులు నగర అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. అదానీ సంస్థకు భూముల కేటాయింపులు కూడా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. నగరంలో మురుగునీరు సముద్రంలోకి చేరకుండా రూ.300 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు, 18 ప్రధాన కాలువల అభివృద్ధి, అన్న క్యాంటీన్ల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. వైసీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రుషికొండ, ఇంధనం, మద్యం, విద్యుత్ ధరల అంశాలపై కూడా వైసీపీని విమర్శించారు.
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఇన్ఆర్బిట్ మాల్‌ను తామే తీసుకొచ్చామని వైసీపీ చెప్పుకోవడంలో వాస్తవం లేదన్నారు. కూటమి జీవీఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, తుపాను సమయంలో రాజకీయాలకు అతీతంగా సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి మాట్లాడుతూ, ‘స్మార్ట్ వైజాగ్–డెవలప్ వైజాగ్’ నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. విద్యావంతురాలైన ముక్కా శ్రావణిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విశాఖ అభివృద్ధికి ముక్కా శ్రావణి తొమ్మిది హామీలు ....
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా 2026–2031 మేయర్ అభివృద్ధి ప్రణాళికను కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ప్రకటించారు. ‘మన విశాఖ – మన అభివృద్ధి – మన భవిష్యత్తు’ నినాదంతో నవ విశాఖ నిర్మాణానికి తొమ్మిది ప్రధాన హామీలను వెల్లడించారు. ప్రతి కాలనీకి మెరుగైన పౌర సేవలు అందించడం, తాగునీటి సరఫరాను మెరుగుపరచడం, మురుగునీటి కాలువలను పరిశుభ్రంగా నిర్వహించడం, ప్రజలకు సురక్షితమైన, సరసమైన ఆహారం అందుబాటులో ఉంచడంతోపాటు ఆహార విక్రయదారులకు తోడ్పాటు అందించడం ప్రణాళికలో భాగంగా పేర్కొన్నారు. మురుగునీరు, వ్యర్థాలు సముద్రంలోకి చేరకుండా చర్యలు తీసుకోవడం, వీధులు, మార్కెట్లు, ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడం, రహదారులను అభివృద్ధి చేసి సత్వర మరమ్మతులు చేపట్టడం వంటి హామీలిచ్చారు. అలాగే మెరుగైన వీధి దీపాల ఏర్పాటు, సురక్షితమైన వీధులు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, క్రీడా సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి, విశాఖను పరిశుభ్రమైన, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతామని ముక్కా శ్రావణి పేర్కొన్నారు.








కామెంట్లు (0)