వామపక్షాలు, ఆమ్ ఆద్మీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధి, ప్రజా వనరుల పరిరక్షణ లక్ష్యంగా సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర వామపక్ష పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. గురువారం ఉదయం మద్దిలపాలెంలోని సీపీఎం జిల్లా కార్యాలయం ఏచూరి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం. పైడిరాజు, ఆమ్ ఆద్మీ పార్టీ విశాఖ జిల్లా కన్వీనర్ ఎం. రవి భాస్కరరావు మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో ఆస్తి పన్ను పెంపును అడ్డుకోవడం, తాగునీటి ప్రైవేటీకరణను నిరోధించడం, ప్రతి వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీటిని ఉచితంగా అందించడం, ఇళ్లు లేని పేదలకు స్థలాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపు, అర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు వంటి హామీలను పొందుపరిచారు. డేటా సెంటర్లకు ప్రజల తాగునీటిని కేటాయించకుండా చూడటంతో పాటు పోర్టులు, ఫార్మా పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించేందుకు పోరాడతామని పేర్కొన్నారు. రహదారులు, పార్కులు, మార్కెట్లు, బీచ్, కైలాసగిరి వంటి ప్రజా వనరుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, సొంత గనుల సాధన, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తామని ప్రకటించారు. అసంఘటిత, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు. అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్యం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, గ్రంథాలయాల ఏర్పాటు, మురికివాడల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మెట్రో రైలు, విశాఖ కేంద్రంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు, విమానాశ్రయాన్ని దేశీయ విమానాశ్రయంగా కొనసాగించడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఫుట్‌పాత్‌ల పరిరక్షణ, చిరు వ్యాపారులకు ప్రత్యేక హాకర్ జోన్లు, పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.
ఈ సమావేశంలో సీపీఐఎంఎల్ (ప్రజాపోరు) విశాఖ జిల్లా నాయకుడు కె. దేవా, ఎంసీపీఐ విశాఖ జిల్లా నాయకుడు జి.వి.ఎన్. రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి. కుమార్, వి. కృష్ణారావు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)