భీమునిపట్నం : వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో భీమిలి మండలంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ముందస్తు చర్యల్లో భాగంగా భీమిలి తహశీల్దార్ పి. రామారావు ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన మంగమారిపేట, ఉప్పాడ, పెద నాగయ్యపాలెంలోని లోతట్టు ప్రాంతలో మత్స్యకార ఆవాసాలను పరిశీలించారు .ప్రజలకు పునరావాస కేంద్రాలుగా కాపులుప్పాడ రెవెన్యూ పరిధిలో ఎంపిపి స్కూలు, చేపలఉప్పాడ పరిధిలో కళ్యాణ మండపం, పెద నాగయ్యపాలెం ఎంపిపి స్కూళ్లను గుర్తించామని తహశీల్దార్ వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెట్లు, హోర్డింగ్‌లు, శిథిలావస్థలో ఉన్న పాత భవనాల వద్ద ఎవరూ ఉండవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి సహాయం కావాలన్నా 9014093139 ఫోన్ నంబర్ ను సంప్రదించాలని కోరారు. కాగా భీమిలిలో బుధవారం సాయంత్రం వరకు వీడకుండా కురుస్తున్న జల్లులతో 33.80 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.









కామెంట్‌లు (0)