-ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారికి తీవ్ర గాయాలు
పెదగంట్యాడ మండలం ఇస్లాంపేట సమీపంలోని పెద్దపాలెం మెట్ట వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనలో సుమారు 45 ఇళ్లు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ఘటనలో ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. కలపాక విద్యుత్ ఉపకేంద్రం నుంచి హిందూజా సంస్థకు సంబంధించిన నిర్వహణ ప్రాంతానికి వెళ్లే 400 కెవి విద్యుత్ లైనులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, 104వ వార్డు వైసిపి అధ్యక్షుడు మద్ది శ్రీనివాసరావు పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ, విద్యుత్ ప్రమాదంతో ఆస్తులు కోల్పోయిన బాధితులను హిందూజా సంస్థ యాజమాన్యం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని, గాయపడిన చిన్నారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి, వైద్య ఖర్చులను భరించాలని కోరారు. బాధితులకు న్యాయం చేయకపోతే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 104వ వార్డు వైసిపి అధ్యక్షుడు మద్ది శ్రీనివాసరావు, వార్డు మైనారిటీ అధ్యక్షుడు షేక్ నన్నా తదితరులు పాల్గొన్నారు.










కామెంట్లు (0)