క్యూఆర్ కోడ్‌తో సమస్యల నమోదు..
వేగవంతమైన పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
ఉద్యోగులు, యాజమాన్యం మధ్య డిజిటల్ అనుసంధానం
ప్రజాశక్తి -ఉక్కునగరం
ఉద్యోగుల సంక్షేమం, కార్యాలయ సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం వినూత్నంగా రూపొందించిన ‘హెచ్‌ఆర్ కనెక్ట్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఆర్‌ఐఎన్‌ఎల్ సిఎండి, డైరెక్టర్లు, సివిఒ సమక్షంలో యాప్‌ను ప్రారంభించారు.
ఈ యాప్ ద్వారా ఉద్యోగులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ కార్యాలయాల నుంచే సమస్యలను హెచ్‌ఆర్ విభాగానికి తెలియజేయవచ్చు. తాగునీరు, వాటర్ కూలర్లు, సివిల్ నిర్వహణ, ఇతర సంక్షేమ సదుపాయాల ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఆయా ఫిర్యాదుల పరిష్కారాన్ని హెచ్‌ఆర్ విభాగం పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదుల స్థితి, పరిష్కార పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డాష్‌బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే హెచ్‌ఆర్ విధానాలు, అవసరమైన ఫార్మాట్లను కూడా యాప్ ద్వారా పొందవచ్చు. ఆర్‌ఐఎన్‌ఎల్ ఐటీ, ఈఆర్‌పీ విభాగం సహకారంతో అంతర్గతంగా రూపొందించిన ఈ యాప్ ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగాన్ని తీసుకురానుంది. ఉద్యోగి కేంద్రిత పని వాతావరణాన్ని బలోపేతం చేయడమే ఈ డిజిటల్ చొరవ ప్రధాన లక్ష్యమని సంస్థ పేర్కొంది.







కామెంట్‌లు (0)