ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్దొద్దు : మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వర్ధన్

5 రోజుల క్రితం

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్దొద్దు     
 మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వర్ధన్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అక్వాన్ తుపాను నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు వర్ధన్ సూచించారు. అక్వాన్ అడ్వైజరీస్ అందించిన వాతావరణ సమాచారం ప్రకారం రానున్న తుపాను గత రెండింటి కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, గాలుల వేగం గంటకు 175 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేసిన నేపథ్యంలో మత్స్యకారులు, చేపల వేట బోట్ల యజమానులు, ఆక్వా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు, బోట్ల యజమానులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో మత్స్యకారులకు ఆయన పలు సూచనలు చేశారు. మత్స్యకారుల ప్రాణాలతో పాటు బోట్లు, వేట పరికరాలు, ఆక్వాకల్చర్ ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సముద్రంలో ఉన్న అన్ని చేపల వేట బోట్లు తక్షణమే సమీపంలోని సురక్షిత ఫిషింగ్ హార్బర్ లేదా ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే హార్బర్లలో ఉన్న బోట్లను కూడా సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించి భద్రపరచాలని, ఫిషింగ్ హార్బర్లలో మెకనైజ్డ్ బోట్ల మధ్య ఫైబర్ బోట్లను నిలపకుండా, గాలి తీవ్రత, అలల ప్రభావం వల్ల నష్టం కలగకుండా తగినంత ఖాళీతో సురక్షితంగా నిలిపేలా చూడాలన్నారు. బోట్లలోని విలువైన సామగ్రి ఇంజన్లు, బ్యాటరీలు, కమ్యూనికేషన్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, తొలగించగలిగే వస్తువులను సురక్షిత ప్రాంతాలకు తరలించి భద్రపరచాలని సూచించారు. సాధ్యమైనంత వరకు చేపల వేట వలలను బోట్ల నుంచి తొలగించి ఇళ్ల వద్ద లేదా ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని చెప్పారు.

​

ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలి

​ భారీ గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆక్వా రైతులు తమ ఆక్వాకల్చర్ చెరువులు, ఏరేటర్లు, మోటార్లు, విద్యుత్ పరికరాలు, పంపులు, ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంయుక్త సంచాలకులు వర్ధన్ సూచించారు. సంబంధిత మత్స్య అభివృద్ధి అధికారులు, సాగర మిత్రులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది తమ పరిధిలోని మత్స్యకార గ్రామాలకు తక్షణమే వెళ్లి బోట్ల యజమానులు, మత్స్యకారులు, ఆక్వా రైతులకు ఈ సూచనలను తెలియజేసి, వాటి అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు, బోట్ల భద్రతకు సంబంధించిన తాజా వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు వర్ధన్ తెలిపారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్