ప్రజాశక్తి-ఆనందపురం
ప్రాదేశిక ఎన్నికల్లో పదవుల పంపకంలో అన్యాయం జరిగిందంటూ ఆనందపురం మండల జనసేన శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లలో టిడిపి, నాలుగు చోట్ల జనసేన ఎంపిటిసిల విజయంతో కూటమి క్లీన్‌స్వీప్ చేయగా, తర్వాత జరిగిన ఎంపిపి, వైస్ ఎంపిపిల ఎన్నికల్లో ఒకే పక్షానికి పదవులు దక్కడంపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఎంపిపి పదవిని బోని ఎంపిటిసి తాట్రాజు అప్పారావుకు కూటమి సర్దుబాటులో కేటాయించగా, వైస్ ఎంపిపి పదవిని జనసేనకు దక్కుతుందని భావించారు. అయితే ఈ పదవిని సైతం టిడిపికే ఇవ్వడంపై పాలవలస ఎంపిటిసి తమ్మిన అప్పలరాజు తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. శుక్రవారం భీమిలి టిడిపి కార్యాలయంలో జరిగిన ఎంపిటిసిల సన్మాన కార్యక్రమంలో జనసేన నాయకులు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకోగా, సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.
ఇదిలా ఉండగా, రానున్న పంచాయతీ ఎన్నికల్లోనైనా జనసేనకు తగిన ప్రాధాన్యత కల్పించి సర్పంచ్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. కూటమిలో సమన్వయం, పదవుల పంపకం, పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అంశాలపై నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.







కామెంట్‌లు (0)