ఉక్కునగరం : ఉక్కునగరం స్మృత్యంజలి పార్కు వద్ద స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు యు.రామస్వామి మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన తాబేదారులకు అమ్మే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు మరో నాలుగు స్టీల్ పరిశ్రమలను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయించినప్పటికీ, మిగిలిన పరిశ్రమల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని తెలిపారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదని విమర్శించారు. కార్మిక హక్కుల పరిరక్షణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమంలో విశాఖ స్టీల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి.శ్రీనివాసరాజు, స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మరిడయ్య, బి.మహేష్, టివికె.రాజు, మొహిద్దిన్, తిమోతి బాబు, పవన్, బొంజుబాబు, అప్పలరాజు, మురళి, నాగబాబు, సిహెచ్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
కంచరపాలెం : చలో ఢిల్లీని జయప్రదంచేయాలని కోరుతూ జివిఎంసి పాత 47వ వార్డులో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు కంచరపాలెం జోన్ కార్యదర్శి ఒ.అప్పారావు మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికుల హక్కులను కాలరాసే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శంకర్, సూర్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)