నిర్మానుష్యంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్
ప్రయాణికులను గాలికి వదిలేసిన అధికారులు
ప్రజాశక్తి - విజయనగరం కోట: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలను తరలించేందుకు విజయనగరం జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన సుమారు 150 బస్సులను వినియోగించారు. దీంతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దాదాపు నిర్మానుష్యంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లో బస్సులు కనిపించకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సి రావడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ప్రయాణికుల అవసరాల కోసం నడవాల్సిన బస్సులను రాజకీయ కార్యక్రమానికి మళ్లించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బస్సులను తరలించడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిందని విమర్శించారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.









కామెంట్‌లు (0)