- పరిశీలించిన జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ రాంసుందర్ రెడ్డి
- సుమారు రూ.80 లక్షల అంచనా వ్యయం
ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : నగరంలోని ప్రధాన సమస్యగా ఉన్న మురుగునీటి శుద్ధి, నిర్వహణపై నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి దృష్టి సారించారు. గంటస్తంభం ప్రాంతం నుంచి పెద్ద చెరువులోకి వెళ్లే ప్రధాన డ్రైనేజీ కాలువలో ఘన వ్యర్థాల (సాలిడ్ వేస్ట్) తొలగింపునకు ఆధునిక సాంకేతికతను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం, గంటస్థంభం వద్దనున్న కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు. కాలువ ప్రస్తుత స్థితిగతులు, చేపట్టబోయే పనుల గురించి మున్సిపల్ కమిషనర్ బాలస్వామి కలెక్టర్‌కు వివరించారు.
ప్రధాన సమస్య పరిష్కారం:
పెద్ద చెరువులోకి మురుగునీరు ప్రవేశించే ముందే ఘన వ్యర్థాలను ఆటోమేటిక్‌గా వేరు చేసేందుకు మెకానికల్ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక యంత్రాల ఏర్పాటుకు సుమారు రూ.80 లక్షలు వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కాలువ పూడికతీత సమస్య తగ్గడంతో పాటు చెరువు కాలుష్య బారిన పడకుండా కాపాడవచ్చు. రాజమండ్రి సక్సెస్ ఫార్ములా: గతంలో రాజమండ్రిలో ఇదే మెకానికల్ స్క్రీన్ విధానం విజయవంతం కావడంతో, అదే మోడల్‌ను ఇక్కడ కూడా అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతమైతే, నగరంలోని మరికొన్ని ప్రధాన కాలువల వద్ద కూడా ఇదే రకమైన మెకానికల్ స్క్రీన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని కమిషనర్ వెల్లడించారు. ఈ పరిశీలన సమయంలో మున్సిపల్ ఇఇ ప్రసాద్, హెల్తాఫీసర్ డాక్టర్ సాంబమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)