సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

17 గంటల క్రితం

aidwa.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఐద్వా డిమాండ్‌

  • కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ : పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. జులైతో పోలిస్తే ఆగస్టు చివరి నాటికి అనేక రకాల సరుకుల ధరలు 40 నుంచి 75 శాతం వరకు పెరిగాయని తెలిపారు. బియ్యం, పప్పులు, పంచదార, వంటనూనె, ఉల్లిపాయలు, కూరగాయలు, వంటగ్యాస్‌, పెట్రోల్‌ తదితర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో పనులు తగ్గిపోయాయని, పట్టణాల్లోనూ ఉపాధి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. దీనికి తోడు పిల్లల చదువులు, వైద్యం, ఇతర ఖర్చులు పెరగడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. ధరల పెరుగుదల ప్రభావం మహిళలపై ఎక్కువగా పడుతోందని, ఇంటి నిర్వహణ కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబంపై నెలకు అదనంగా రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకు భారం పడుతోందని తెలిపారు. గత ఏడాదిలో ఉల్లిపాయల ధర 100 శాతానికి పైగా పెరిగిందని, పంచదార ధర కిలో రూ.70 దాటిందని రమణమ్మ అన్నారు. వంటనూనెలు, కందిపప్పు, బియ్యం, ఎండుమిర్చి తదితర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయని తెలిపారు. ధరల పెరుగుదలతో కుటుంబాలు పోషకాహారాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీనివల్ల మహిళలు, పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. పండుగల సీజన్‌ ప్రారంభమైన సమయంలో నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరగడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారంగా మారిందన్నారు. హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని దళారులు లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. చౌకధర దుకాణాల ద్వారా బియ్యం, పప్పులు, పంచదార, వంటనూనె, ఉల్లిపాయలు తదితర సరుకులను సబ్సిడీ ధరలకు అందించాలని కోరింది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కూరగాయలు, ఉల్లిపాయలను తక్కువ ధరలకు విక్రయించాలని సూచించింది. దళారులు, అక్రమ నిల్వదారులు, బ్లాక్‌ మార్కెట్‌పై ప్రత్యేక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ఉపశమనం కల్పించాలని, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని కోరింది. ప్రజలపై ధరల భారం తగ్గించి, అందుబాటు ధరలకు నిత్యావసర సరుకులు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రమణమ్మ స్పష్టం చేశారు. ధరలు తగ్గించాలని, ప్రజలను ఆదుకోవాలని, దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఐద్వా నాయకులు ఎం. జగదాంబ, వి. లక్ష్మి, కె. రమణమ్మ, ఈ. నాగలక్ష్మి, సిహెచ్‌. రమణమ్మతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్