షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వమే నడపాలి
షుగర్ ఫ్యాక్టరీల అమ్మాకాన్ని విరమించు కోవాలి
తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జీవో నెంబర్ 255 ను రద్దు చేసి సహకారంగాన్ని కాపాడాలని, షుగర్ ఫ్యాక్టరీల అమ్మకాన్ని విరమించుకోవాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఆదివారం విజయనగరం స్థానిక ఎల్.బి.జీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 255ను ముందుకు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం 8 షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేందుకు పూనుకుందని ఆరోపించారు. ముందస్తుగా భీమా సింగ్, తాండవ, ఏటి కొప్పాక షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేందుకు మూర్తం పెట్టిందన్నారు. మరో 5 షుగర్ ప్యాక్టరీలకు సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షుగర్ ప్యాక్టరీల్లో పని చేసే ఉద్యోగులకు, కార్మికులకు, రైతులకు చెల్లించాల్సిన 13 వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కనీసం వీరి అందరి వద్ద అభిప్రాయాలు తెలుసుకో కుండానే ఫ్యాక్టరీల అమ్ముకోవడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించుకోవడం కోసం ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి చర్యలకు పూనుకున్నాదన్నారు. రైతుల భాగస్వామ్యంతో ఏర్పడిన సహకార రంగాన్ని ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో జనరల్ బాడీలు వేసి కనీసం వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం లేదన్నారు. ఈ రకమైనటువంటి చర్యలు వెనుక కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు ముడిపడి లేవని స్పష్టం చేశారు. రైతులకు, ఉద్యోగులకు, కార్మికులకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయి కూడా చెల్లించక పోవడం దుర్మార్గమన్నారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మికులకు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 40.23 కోట్ల రూపాయలు చెల్లించలేదని ఈ రకమైన బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని షుగర్ ఫ్యాక్టరీల్లో ఉన్నాయన్నారు. షుగర్ ఫ్యాక్టరీల చుట్టూ ఉన్న రైతులకు చెరుకును పండించడమే జీవనాధారం తప్ప మరే వ్యవసాయం లేదని తెలిపారు. రైతులను ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం సహకార రంగంలో ఉన్న రుణాలను మాఫీ చేసి సహకార రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. వెంటనే జీవో నెంబర్ 255 ను రద్దుచేసి సహకార రంగాన్ని ప్రభుత్వం కాపాడాలని, షుగర్ ఫ్యాక్టరీలను నడపాలని కోరారు. అలాగే జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు, ఇతర వ్యవసాయ పంటలకు నష్టం జరిగి సుమారు 10 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. తుఫాను నష్టం పై వ్యవసాయ అధికారులతో సమగ్రమైన దర్యాప్తు జరిపించి పంటల నష్టం పై అంచనా వేయాలని రైతులను ఆదుకోవాలని కోరారు. లేనియెడల భవిష్యత్తులో రైతులతో కలిసి పోరాటాలకు పూను కొంటామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)