ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పూల్‌బాగ్ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న ఇల్లులేని దళిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పక్కా ఇళ్లు మంజూరు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. సామాజిక శంఖారావం సర్వేలో భాగంగా ఆదివారం పూల్‌బాగ్ ఎస్సీ కాలనీలో నిర్వహించిన సర్వే సందర్భంగా ఆయన కాలనీవాసుల సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. కాలనీలో ప్రస్తుతం ఒకే ఇంటిలో మూడు కుటుంబాలు నివసిస్తున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇల్లులేని దళితులకు కొత్త పక్కా ఇళ్లు నిర్మించాలని కోరారు. గతంలో క్వారీల్లో పనిచేసే కార్మికులకు ప్రస్తుతం ఉపాధి లేకపోవడంతో పురుషులు అపార్ట్‌మెంట్లలో సెక్యూరిటీ గార్డులుగా, కాపలాదారులుగా పనిచేస్తున్నారని చెప్పారు. మహిళలు ఇళ్ల పనులకు వెళ్తున్నప్పటికీ వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదన్నారు.
గత ఆరు నెలలుగా డ్వాక్రా రుణాల వాయిదాలు చెల్లించలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తే కొంత ఊరట లభిస్తుందని మహిళలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, 50 ఏళ్ల వయస్సు నుంచే పింఛన్ ఇవ్వాలని వారు కోరినట్లు వెల్లడించారు. కాలనీలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సర్వేలో కాలనీవాసులు, దళిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)