స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలి
62 ముద్దు 65 వద్దు
రేపటి నుంచి అత్యవసర సర్వీసులు బంద్
ప్రజాశక్తి- విజయనగరం కోట : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు, ఎస్ ఆర్ డాక్టర్లకు సంబంధించిన స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలని ఏపీ జూడ, విజయనగరం జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ గాడే రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ప్రధాన డిమాండ్ లైన మూడింటిని పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగారు. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, హాస్పటల్ సూపరింటెండెంట్ అల్లు పద్మజ కోరిక మేరకు ఏపీ జూడా విజయనగరం జూనియర్ డాక్టర్లు వారం రోజులు సమ్మెను వాయిదా వేసారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సరైన హామీ రాకపోవడంతో ఈనెల 17వ తేదీ నుంచి జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా ప్రెసిడెంట్ రేవంత్, వైస్ ప్రెసిడెంట్ గుల్ల జస్వంత్ మాట్లాడుతూ .. మా ప్రధానమైన డిమాండ్లలో ఒకటైన స్టైఫండ్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం డాక్టర్ల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలుగా ఉందని, దీనిని ప్రభుత్వం 65 సంవత్సరాలకే పెంచాలని యోచిస్తోందని అన్నారు. 65 సంవత్సరాలకు పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. వైద్య కళాశాలలో ఎంబిబిఎస్, ఎంఎస్ చేస్తున్న విద్యార్థులకు ఎంఎస్సీ, పీహెచ్డీ వారి చేత క్లాసులు చెప్పించడమేమిటిని ప్రశ్నించారు. ఇప్పటివరకు హాస్పిటల్స్ సూపర్డెంట్ జిల్లా కలెక్టర్ కోరిక మేరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోగులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 విధులు నిర్వహించామన్నారు. అయితే రేపటి నుంచి ఏపీ స్టేట్ జూడ పిలుపుమేరకు అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, గైనిక్, ఆప్తమాలజీ విభాగాల్లోని పీజీ విద్యార్థులతో పాటు, సీనియర్ రెసిడెన్షియల్ డాక్టర్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే కాకుండా పిహెచ్సీ సెంట్రల్ లో కూడా అత్యవసర సేవలు నిలుపుపడతాయని తెలిపారు. ఈ సమ్మెలో ఏపీ జూడా విజయనగరం జూనియర్ డాక్టర్స్ సెక్రెటరీ గేదెల మోషిత్, స్పోక్స్ పర్సన్ బండారి పాత్రుడు, వైస్ ప్రెసిడెంట్ సోనాల్ అగర్వాల్ తో పాటుగా 101 మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)