కమిషనర్ ని సత్కరించిన నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అందరి సమన్వయంతోనే రాష్ట్రస్థాయి అవార్డు సాధించగలిగామని కమిషనర్ బాలస్వామి అన్నారు. ఇదే స్పూర్తితో రానున్న రోజుల్లో జాతీయ స్థాయి అవార్డులు సాధించేందుకు మరింత కృషి చేయాలని అధికారులను, సిబ్బందిని ఉద్వుక్తులను చేశారు. సోమవారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న నేపథ్యంలో కమిషనర్ బాలస్వామిని అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అందుకున్న జ్ఞాపికను ప్రదర్శించారు. అనంతరం ఆయన సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమ నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసాయన్నారు. దాని ఫలితంగానే రాష్ట్రస్థాయి అవార్డును సాధించగలిగామన్నారు. ముఖ్యంగా స్థానిక శాసన సభ్యురాలు అదితి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి సహాయం మరువలేనిదని అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయం పక్కన ఎల్లో స్పాట్లను రూపుమాపి ఆకర్షణీయమైన పెయింటింగులను వేయడం ఆహ్వానించ దగ్గ పరిణామమన్నారు. అలాగే హెచ్చుస్థాయి చెత్తల తొలగింపు, సామాజిక మరుగుదొడ్ల శుభ్రత, కాలువలలో చెత్తల ప్రక్షాళన వంటి అంశాలు సమర్థవంతంగా నిర్వహించడం అందరి కృషి ఫలితమేనని అన్నారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందడంతో మరింత బాధ్యత పెరిగినట్లయిందని అన్నారు.








కామెంట్‌లు (0)