ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదర్శనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే

1 రోజు క్రితం

మహాత్ముడి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 11:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మహాత్ముడి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు

  • పూలే ఆశయాలు, పోరాట స్ఫూర్తితో సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  • జిల్లా కలెక్టర్ ఎస్‌. రాంసుందర్ రెడ్డి

ప్రజాశక్తి - విజయనగరం టౌన్: మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ ఎస్‌. రాంసుందర్ రెడ్డి కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. తొలుత పూలే చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో తరతరాలుగా వేళ్లూనుకుపోయిన కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అణగారిన వర్గాలకు విద్య, ఆత్మగౌరవం, సమాన హక్కులు కల్పించడమే లక్ష్యంగా ఆయన సాగించిన ఉద్యమం భారత సామాజిక చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహిళల విద్యాభివృద్ధి కోసం పూలే విశేషంగా కృషి చేశారని తెలిపారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు, అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. కుల, మత, వర్గ భేదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం లభించాలన్నదే పూలే ఆశయమని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు నేటి యువతకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. పూలే ఆశయాలు, పోరాట స్ఫూర్తితో సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌. సత్తిబాబు, జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి జె. జ్యోతిశ్రీ, ఏపీఆర్వో సిహెచ్‌. ప్రభుదాస్, బీసీ సంక్షేమాధికారులు, బీసీ ఉద్యోగులు, వివిధ బీసీ సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్