ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ
ప్రజాశక్తి – విజయనగరం టౌన్: మహిళలకు పురుషులతో సమానత్వం సాధించేందుకు మహాకవి గురజాడ స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ అన్నారు. సోమవారం గురజాడ 164వ జయంతి సందర్భంగా గురజాడనగర్, ఎల్‌బీజీ నగర్, కనపాక, వినాయకనగర్‌లో ఐద్వా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ.. వృద్ధ పురుషులకు చిన్న వయసులో బాలికలను వివాహం చేసే దురాచారానికి వ్యతిరేకంగా పోరాడిన మహిళా పక్షపాతి, సంఘసంస్కర్త, మహాకవి గురజాడను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ‘కన్యాశుల్కం’ వంటి రచనల ద్వారా ఆనాటి సాంఘిక దురాచారాలను గురజాడ ఎండగట్టారని పేర్కొన్నారు. కుల, మత ఉన్మాదాలకు వ్యతిరేకంగా గురజాడ తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో గురజాడ భావజాలాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. గురజాడ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తామని, మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఐద్వా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మహిళలంతా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాల్లో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు పుణ్యవతి, జిల్లా కమిటీ సభ్యురాలు రామలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)