భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలి
ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్
కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎపి భవన నిర్మాణ కార్మిక సంఘం(సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.సురేష్, కోశాధికారి జగన్మోహన్రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి బి.రమణ మాట్లాడుతూ కార్మికుల సుదీర్ఘ పోరాటాల తరువాత 2026 మార్చి 1వ తేది నుండి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పున:ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాని గతంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలన్నింటిని తిరిగి ప్రారంభించకుండా కేవలం కొన్ని ప్రయోజనాలు మాత్రమే అందిస్తున్నదన్నారు. ఆచరణలో అత్యధిక మంది కార్మికులు వెల్ఫేర్ బోర్డు ద్వారా సమకూరే ప్రయోజనాల కోసం దూరంగా ఉండిపోవాల్సి వస్తుందన్నారు. గతంలో వెల్ఫేర్ బోర్డులో నమోదుచేసుకున్న కార్మికుల్లో 5 సం॥ల కాలం నిండి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు జరగని కారణంగా కార్మికులు తమ పేర్లను అత్యధిక మంది రెన్యూవల్స్ చేసుకోలేదన్నారు. కొత్త వారు ఎవరూ బోర్డులో సభ్యులుగా చేరలేదు. ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును తిరిగి ప్రారంభించిన తరువాత వెల్ఫేర్ బోర్డులో రెన్యూవల్స్ చేసుకోని కార్మికులకు రెన్యూవల్స్ చేసుకునే అవకాశం కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ ఆన్లైన్లో రెన్యూవల్స్ చేసుకోవాలనడం కార్మికులందరికీ ఆచరణీయం కాదన్నారు. ఎందుకంటే అత్యధిక మంది కార్మికులకు మెబైల్ ఫోన్లపై సరైన సాంకేతిక అవగాహనలేదు. పేరుకు స్మార్ట్ ఫోన్ వాడుతున్నా దానిపై అవగాహన అతి తక్కువ మందికి మాత్రమే ఉన్నదన్నారు. కొత్త వారు నమోదు చేసుకోవలన్నా ఇదే పరిస్థితి ఉన్నది. కార్మికశాఖ ఆన్లైన్ ప్రోత్సహించడంతో పాటు ఆఫ్ లైన్ కూడా అనుమతించాలని ఏపి బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తిచేస్తున్నదన్నారు. వెల్ఫేర్ బోర్డులో 4,500 కోట్లకు పైగా నిధులు ఉన్న (అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన సమాచారం ప్రకారం) కార్మికులకు నిరుపయోగంగా ఉన్నది. నిర్మాణ రంగంలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా ఉన్నది. నిత్యం వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రమాదాల భారిన పడి చనిపోతున్నారు. వందలాది మంది వికలాంగులుగా మారుతున్నారు. వీరిఎవ్వరికీ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆర్ధిక ప్రయోజనం జరగటంలేదన్నారు.
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలో ప్రమాదబీమా 10 లక్షల రూపాయలు అమలుచేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎటువంటి ప్రమాద బీమా అమలు జరగడంలేదన్నారు. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు గతంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలన్నీ అమలుజరుపుతూ ప్రమాదబీమాని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తూ చనిపోయిన కార్మికులకు 10 లక్షలు సష్టపరిహారం ఇవ్వాలనీ, ప్రమాదంలో అంగవైకల్యంపాలైన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలనీ, 1214 మెమో విడుదల చేయటానికి ముందు జిల్లా సూటినీ కమిటీల ద్వారా ఆమోదమైన క్లెయిమ్లకు వెంటనే నగదు చెల్లించాలనీ, 1214 మెమో వచ్చినదగ్గర నుండి 2026 మార్చి 1వ తేదీకి మధ్యలో బోర్డు సభ్యులుగా ఉన్న కార్మికుల్లో ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజమరణం పాలైన వారి కుటుంబాలకు నష్టపరిహారంతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలను అమలుచేయాలనీ, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు వెల్ఫేర్ బోర్డు ద్వారా చెల్లించాలనీ డిమాండ్ చేశారు. కొత్త కార్డుల నమోదు, పాతకార్డుల రెన్యూవల్స్ ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ పద్దతి కూడా అమలుచేయాలనీ, అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు గృహనిర్మాణానికి సబ్సిడి లోన్ మంజూరు చేయాలనీ, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు చదువుకోవడానికి స్కాలర్ షిప్లు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘం నాయకులు బి వెంకటరావు, దాసరి శ్రీనివాసరావు, డి.గడ్డి నాయుడు, ఎం.పైడినాయుడు, బి.కృష్ణ, కె.సూరిబాబు, కె.వేణు కార్మికులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)