కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఇంచార్జ్ మరోతి శివ గణేష్
ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని గుమ్మలదొడ్డి గ్రామంలో ఉన్న అసాగో పరిశ్రమ కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివ గణేష్ ఆరోపించారు. కాలుష్యకారక పరిశ్రమను గ్రామం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గుమ్మలదొడ్డి గ్రామానికి వెళ్లిన ఆయనను వీరలంక పల్లి గ్రామం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ప్రజా అభిప్రాయ సేకరణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గ్రామప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో గ్రామ ప్రజలకు మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు సమస్యలను తెలియజేస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.పరిశ్రమ విస్తరణ, కాలుష్య సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.








కామెంట్‌లు (0)