- ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి
- మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల లభ్యత, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో నిర్వహించిన వెబినార్‌ను మంత్రి ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణంగా నమోదుకావాల్సిన 225.7 మి.మీ. వర్షపాతానికి బదులుగా 104.5 మి.మీ. మాత్రమే నమోదైందని, 53.7 శాతం లోటు ఏర్పడిందని తెలిపారు. 28 జిల్లాల్లో 21 జిల్లాలు వర్షపాతం లోటు కేటగిరీలో ఉన్నాయని, ఆరు జిల్లాల్లో తీవ్ర వర్షపాతం లోటు నెలకొందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. నాలుగు వ్యవసాయ వాతావరణ మండలాలూ వర్షపాతం లోటు కేటగిరీలోనే కొనసాగుతున్నాయని చెప్పారు. సీజన్ సాధారణ పంట విస్తీర్ణం 30.84 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 16.35 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని తెలిపారు. ఇది సాధారణ సాగు విస్తీర్ణంలో 39 శాతమని చెప్పారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్న, ఉలవ పంటల సాగు వెనుకబడి ఉందని, ప్రత్యామ్నాయ పంటల సాగును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కందులు, పెసలు, కొర్రలు, మినుములు, నువ్వులకు సంబంధించిన 14,078 క్వింటాళ్ల అత్యవసర ప్రత్యామ్నాయ విత్తనాలను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో రైతులకు సకాలంలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర ఎల్‌నినో పంట రక్షణ మిషన్‌ను ప్రారంభించి, వాతావరణం, ఉపగ్రహ సమాచారం, నీటి లభ్యత, క్షేత్రస్థాయి సమాచారాన్ని సమీకరించేలా 24 గంటలూ పనిచేసే రాష్ట్ర ఎల్‌నినో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఖరీఫ్‌లో వరి మినహా ఇతర పంటలకు పంటల బీమా నమోదు గడువు జూలై 31తో ముగుస్తుందని, వరి పంటకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉందని తెలిపారు.








కామెంట్‌లు (0)