- ఈనెల 29లోగా పంపించాలి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తమ అభిప్రాయాలను ప్రపంచానికి తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తూ"30-సెకన్ల రీల్ పోటీ"ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోటీలో పాల్గొనే వారు వ్యక్తిగతంగా(సెల్ఫీ రీల్), స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి (గ్రూప్ రీల్) 30 సెకన్ల నిడివి ఉన్న రీల్‌ను రూపొందించాలని పేర్కొంది."అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అంటే మీకు ఏమిటి?"అనే అంశంపై తమ భావాలు, సందేశాన్ని సృజనాత్మకంగా వివరించాలని తెలిపింది. పోటీలో పాల్గొనే వారు30 సెకన్ల నిడివి ఉన్న వీడియో రీల్‌ను రూపొందించి, తమ వ్యక్తిగత ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయాలని పేర్కొంది. పోస్టులో తప్పనిసరిగా @ ఎపి అఫిషియల్ న్యూస్‌ను ట్యాగ్, ఎఎస్‌ఆర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాలని తెలిపింది. పోటీలో అందిన రీల్స్‌లో సృజనాత్మకత, సందేశం ప్రభావం, ప్రజాదరణ, ప్రేక్షకుల స్పందన అంశాల ఆధారంగా ఉత్తమ ఐదు రీల్స్‌ను ఎంపిక చేసి విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారని పేర్కొంది. పోటీలో పాల్గొనే వారు తమ రీల్‌ను ఈనెల29లోగా సమర్పించాలని తెలిపింది. యువత, విద్యార్థులు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ప్రవాసాంధ్రులు ఉత్తరాంధ్ర ప్రజలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పట్ల తమ గర్వాన్ని ప్రపంచానికి చాటాలని కోరింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు సాకార రూపమని పేర్కొంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు, పర్యాటక రంగ విస్తరణక, ఉపాధి అవకాశాల పెరుగుదలకు, ప్రపంచంతో ఉత్తరాంధ్ర అనుసంధానానికి నూతన దారులు తెరవబోతోందని తెలిపింది.








కామెంట్‌లు (0)