శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా బి.బలరాం ఎన్నిక

19 నవంబర్, 2026

west godavari.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 02:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఏలూరు : తెలంగాణ రాష్ట్రం నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరిగిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరాం జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మహాసభల్లో 167 మందితో జాతీయ కౌన్సిల్, 87 మందితో కేంద్ర కిసాన్ కమిటీ (సీకేసీ) ఏర్పాటుకాగా, 27 మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు.

బలరాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన పలు రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతుల రుణాలు మాఫీ చేసి రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలను నివారించాలని మహాసభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్లు బలరాం తెలిపారు. రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి వారిని భూమిలేని కూలీలుగా మార్చవద్దని తీర్మానించినట్లు పేర్కొన్నారు.

గ్రామీణ, పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని మహాసభ కోరింది. ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్, డీజిల్, ఔషధాలు, నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తీర్మానించింది. రానున్న రోజుల్లో రైతులు, కౌలు రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది. నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిర్వహించే రైతు ఆందోళనలకు, డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో కార్మికులు చేపట్టనున్న నిరవధిక ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.


ఈ మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్ ధావలే, విజు కృష్ణన్ తిరిగి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కే.ప్రభాకర్ రెడ్డి జాతీయ సహాయ కార్యదర్శిగా ఎన్నికవగా, సీకేసీ సభ్యులుగా వి.కృష్ణయ్య, ఎం.హరిబాబు, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎం.సూర్యనారాయణ ఎన్నికయ్యారు.

మహాసభ ప్రారంభం రోజున లక్ష మందితో భారీ రైతు ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్రి ఫెస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలను వేలాది మంది వీక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్